రష్యా పర్యటనకు విచ్చేసిన బరాక్ ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రష్యా పర్యటనకు విచ్చేశారు. ఇరుదేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పటిష్టపరుచుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేసంలో రష్యా నేతలతో బరాక్ ఒబామా భేటీ అవతారు. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత బరాక్ ఒబామా రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి.

బరాక్ ఒబామా సోమవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో మాస్కో పశ్చిమ ప్రాంతంలోని వ్నుకోవో విమానాశ్రయంలో అడుగుపెట్టారు. అనంతరం రష్యా అధ్యక్షుడు ద్మిత్రీ మెద్వదేవ్‌తో చర్చలు జరిపేందుకు క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష నివాసం)కు బయలుదేరి వెళ్లారు. గత ఏడాది ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా రష్యా, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

వీటిని తిరిగి గాడిలో పెట్టేందుకు తాజా పర్యటనలో బరాక్ ఒబామా ప్రయత్నిస్తారు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లతో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు జరుపుతున్న యుద్ధంలో సహకరించాలని రష్యా నేతలను ఒబామా కోరతారు. వీటితోపాటు కీలక అణ్వుయుధ ఒప్పందంపై రష్యా నేతలతో చర్చలు జరుపుతారు.

ఇదిలా ఉంటే రష్యా ప్రధానమంత్రి వ్లాదిమీర్ పుతిన్- బరాక్ ఒబామా మధ్య మంగళవారం ఉదయం జరిగే సమావేశంపైనా ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

ఈ సమావేశం వాడివేడిగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని వ్లాదిమీర్ పుతిన్‌ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. పుతిన్ ఇంకా గతంలోనే ఉండిపోయారని ఒబామా వ్యంగ్యాస్త్రాలు విసిరిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి