లండన్‌కు ముంబయి తరహా దాడుల భయం

లండన్ మహానగరానికి ముంబయి తరహా దాడుల భయం పట్టుకుంది. ముంబయి తరహాలోనే లండన్‌లోనూ ఉగ్రవాద దాడులు జరుగుతాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. లండన్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద దాడులు జరగవచ్చని బ్రిటన్ నిఘా సంస్థ అధికారి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు.

థేమ్స్ నదిలో పేలుడు పదార్థాలు నింపిన బోట్లతో వచ్చి ఉగ్రవాదులు పర్యాటక కేంద్రాలపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు. గత ఏడాది నవంబరులో ముంబయి మహానగరంలోకి కూడా ఉగ్రవాదులు సముద్రమార్గం గుండా చొరబడ్డారు. బోట్లలో ముంబయి తీరానికి చేరుకున్న పది మంది ఉగ్రవాదులు సుమారు మూడు రోజులపాటు ముంబయిలో మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ దాడుల్లో 180 మందికిపైగా మృతి చెందారు. ముంబయి తరహాలోనే లండన్‌లోని దాడులు జరిగేందుకు అవకాశం ఉందని బ్రిటన్ నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. లండన్‌లోని సుమారు 100 కీలక ప్రదేశాలకు ఉగ్రవాద ముప్పు పొంచివుందని డైలీ స్టార్ పత్రికతో ఓ భద్రతాధికారి పేర్కొన్నారు. దాడులు చేసేందుకు సులభమార్గాన్ని ముంబయి దాడులు చూపించాయని ఆయన చెప్పారు.

వెబ్దునియా పై చదవండి