గూగుల్ ఫోన్ హ్యాక్ అయ్యింది.. కేవలం 60 సెకన్లలోనే.. రూ.81లక్షల రివార్డ్..

ఆదివారం, 13 నవంబరు 2016 (12:45 IST)
గూగుల్ ఫోన్‌కు హ్యాకింగ్ తప్పలేదు. గూగుల్ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన పిక్సెల్‌ ఫోన్‌ను చైనీస్‌ హ్యాకర్లు హ్యాక్‌ చేసేశారు. కేవలం 60 సెకన్లలోనే. ఈ ఫోన్‌ను మాత్రమే కాకుండా.. యాపిల్‌ సఫారీ బ్రౌజర్‌.. అడోబ్‌ ఫ్లాష్‌ సాఫ్ట్‌వేర్లలోనూ సాంకేతిక లోపాలను వెలికితీసి అందరూ షాక్ అవుతున్నారు. నిమిషాల వ్యవధిలోనే దిగ్గజ సంస్థల నుంచి కోట్ల రూపాయల రివార్డులు కొల్లగొట్టేశారు. 
 
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఈ శుక్రవారం జరిగిన 'పీడబ్ల్యూఎన్‌ఫెస్ట్‌' హ్యాకింగ్‌ పోటీల్లో చైనా నిపుణులు సత్తా చాటారు. 'కిహూ 360' అనే హ్యాకర్ల బృందం.. గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌లో కేవలం 60సెకన్లలోనే ఓ లోపాన్ని ఎత్తిచూపించింది. ఆ లోపాన్ని ఆసరాగా చేసుకుని పిక్సెల్‌ ఫోన్లలో రిమోట్‌గా కోడ్‌ను రన్‌ చేసే వీలుందని వేదికపై చూపించారు. దాంతో ఆ బృందానికి 1,20,000 డాలర్ల(రూ.81లక్షలు) రివార్డును గూగుల్‌ ఇవ్వనుంది. 
 
ఆ హ్యాకర్లే 'అడోబ్‌ ఫ్లాష్‌' సాఫ్ట్‌వేర్‌లోనూ లోపం ఉన్నట్లు కేవలం 4 సెకన్లలోనే బయటపెట్టారు. అందుకు అడోబ్‌ సంస్థ నుంచి 1,20,000 డాలర్లు కొట్టేశారు. అలా 'కిహూ 360' టీంకు చెందిన హ్యాకర్లు మొత్తం 5లక్షల 20వేల డాలర్లు(దాదాపు రూ.3.5కోట్లు) రివార్డులు పట్టుకెళ్లారని 'ది రిజిస్టర్‌' అనే మీడియా సంస్థ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి