ఇటీవల దేశ టెలికాం రంగంలోకి అడుగుపెట్టి సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియోను అగ్రగామిగా నిలిపేందుకు ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే జియో కస్టమర్లకు వెల్‌కమ్ ఆఫర్ కింద మూడు నెలల పాటు ఉచిత నెట్, వాయిస్ కాల్‌ను అందిస్తోంది.
అలాగే, రిలయన్స్ జియో 185 రూపాయలకే డీటీహెచ్ సేవలను అందించబోతోందని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం రిలయన్స్ జియో మరికొద్ది రోజుల్లో ఈ విషయంతో పాటు మరో ప్రకటన చేసేందుకు సిద్ధమైంది. అది అలాంటి ఇలాంటి ప్రకటన కాదు. ఇంటర్నెట్ సేవలను మరింత చౌకగా అందించేందుకు జియో సిద్ధపడినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై జియో యాజమాన్యం కూడా మీడియాకు ఉప్పందించింది. త్వరలో రిలయన్స్ జియో ఓ కొత్త వెంచర్ ప్రారంభించబోతోందని కంపెనీ ప్రకటించింది. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇవ్వాలని జియో నిర్ణయించింది. 500 రూపాయలకే 600జీబీ డేటాను ఇవ్వనున్నట్లు తెలిసింది. అంతేకాదు ఇంటర్నెట్ స్పీడ్ కూడా 120ఎంబీపీఎస్ నుంచి 1జీబీ మధ్యలో ఉంటుందని ప్రకటించింది.
జియో గిగాఫైబర్ స్పెషల్ ఆఫర్ ప్లాన్ పేరుతో బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియోకేర్.నెట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను ఉంచింది. జియో గిగాఫైబర్ బ్రాడ్‌బాండ్ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా వెల్‌కమ్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల పాటు అపరిమిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ముంబై, పూణెలో ఇప్పటికే జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్ సర్వీస్ అందుబాటులో ఉందని, త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను ప్రవేశపెట్టబోతున్నామని కంపెనీ ప్రకటించింది.