వరల్డ్ మోస్ట్ పాపులర్ పాస్‌వర్డ్ ఏంటో తెలుసా?

మంగళవారం, 17 జనవరి 2017 (14:32 IST)
సాధారణంగా ఇంట్లో పుట్టిన పాపాయికి పేరు పెట్టేందుకు ఎన్నో రకాల పుస్తకాలు తిరగేయడమే కాకుండా వందల సంఖ్యలో పేర్లను పరిశీలిస్తుంటాం. అలా తిరగేయగా కనిపించే పేర్లలో మనకు కాస్తభిన్నంగా కనిపించే పేరును ఎంపిక చేసి బుజ్జిపాపాయికి పెట్టడం జరుగుతుంది. 
 
మరి ఆలాంటిది మనం సంపాదించిన డబ్బును దాచుకుంటున్న బ్యాంక్‌ అకౌంట్‌ పాస్‌వర్డ్‌, సోషల్‌ మీడియా వెబ్‌సైట్ల పాస్‌వర్డ్‌, మెయిల్స్‌, పనిచేస్తున్న సంస్థల్లో ఉపయోగించే పాస్‌వర్డ్‌లను ఎంత జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ 2016లో దాదాపు కోటి మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వేలో '123456' అంకెల వరుసను ఎక్కువ మంది పాస్‌వర్డ్‌గా పెట్టుకున్నారనీ, వీరిలో ఎక్కువ మంది హ్యాకర్లకు చేతిలో చిక్కి నష్టపోయినట్టు ఆ సర్వేలో తేలింది. ఈ అంకెలు వరల్డ్ మోస్ట్ పాపులర్ పాస్‌‌వర్డ్‌గా ఉన్నట్టు తెలిపింది. 
 
ఈ సర్వేను భద్రతా సంస్థ 'కీపర్‌ సెక్యూరిటీ' నిర్వహించింది. గతేడాది 10 మిలియన్ల ఖాతాలను హ్యాక్‌ చేసి ఇంటర్నెట్‌లో బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఖాతాలపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. చాలా మంది ఆన్‌లైన్‌ వినియోగదారులు ఒకే పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడమనేది ఆశ్చర్యమే కాదు, ఆందోళన కలిగించే విషయం. దీనితో పాటు '123456789' సంఖ్యను పాస్‌వర్డ్‌గా ఎంపిక చేసుకున్న వాళ్లు రెండోస్థానంలో ఉండగా.. కీ బోర్డులోని ఆంగ్ల అక్షరాల వరుస 'క్యూడబ్యూఈఆర్‌టీవై' పాపులర్‌ పాస్‌వర్డ్‌గా మూడో స్థానంలో నిలిచినట్టు ఆ సంస్థ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి