నాపై దాడి జరగడం ఇది తొమ్మిదో సారి : అరవింద్ కేజ్రీవాల్

ఆదివారం, 5 మే 2019 (13:36 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై తాజాగా మరో దాడి జరిగింది. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించారు. ఈ దాడిపై కేజ్రీవాల్ స్పందిస్తూ, గత ఐదేళ్లలో నాపై దాడి జరగడం మొత్తంగా ఇది తొమ్మిదోసారి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదోసారి. భారతదేశ చరిత్రలో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పలుమార్లు దాడి జరగడం బాధాకరం, ఇది ఊహించలేనిదన్నారు. 
 
దేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి భద్రత బాధ్యత ప్రతిపక్ష పార్టీ బీజేపీ చేతిలో ఉంది. ఇలాంటి వింత వ్యవహారం దేశంలోనే ఒక్క ఢిల్లీలోనే ఉంది. ఒక ముఖ్యమంత్రిపై దాడి జరిగితే ఎలాంటి ఫిర్యాదు రాలేదని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. 
 
ఈ దాడి ఘటనలకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి. ఇది అరవింద్‌ కేజ్రీవాల్‌పై దాడి కాదు.. మొత్తం రాష్ట్ర ప్రజానీకంపై జరిగిన దాడిగా కేజ్రీవాల్‌ అభివర్ణించారు. నాపై దాడికి బీజేపీ కార్యాలయంలోనే ప్రణాళికలు రచించారు. ఎన్నికల కమిషన్‌ వంటి సంస్థలు ఏం చేయట్లేదని కేజ్రీవాల్‌ ఆరోపించారు.
 
మరోవైపు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడిని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఖండించారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌పై దాడికి ఢిల్లీ పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధమన్నారు. వ్యవస్థలన్నింటినీ  నాశనం చేసే శక్తులు ఇప్పుడు భౌతిక దాడులకు దిగుతున్నాయంటూ పరోక్షంగా బీజేపీపై ఆరోపణలు చేశారు.  
 
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటివరకు ఓడించడానికి, అణచివేయడానికి, పార్టీని కనుమరుగు చేయడానికి, అవమానించడానికి, కుంగుబాటుకు గురిచేయడానికి విశ్వప్రయత్నాలు చేశారని, కుదరకపోవడంతో ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇది వారి ఓటమికి సంకేతమని చంద్రబాబు వ్యాఖ్యానించారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు