తొలి పుట్టిన రోజే ఆ బిడ్డకు మృత్యుదినమైంది.. అమ్మ చేతి ముద్దతో ప్రాణం పోయింది..!

సోమవారం, 1 ఆగస్టు 2016 (16:55 IST)
పుట్టిన రోజే ఆ బాబుకు మృత్యుదినమైంది. తొలి పుట్టిన రోజును మంచిగా జరుపుకోవాలని.. కేక్ కట్ చేయాలని.. పక్కింటి పిల్లలకు చాక్లెట్ ఇవ్వాలని ఆత్రుతగా ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది. సరిగ్గా ఏడాది ప్రాయంతోనే ఆ బిడ్డ ఆయుష్షు ముగిసిపోయింది. తల్లి పెట్టిన అన్నం ముద్దే ఆ బిడ్డ పాలిట శాపంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే? తల్లి పెట్టిన అన్నం ముద్ద గొంతులో చిక్కుకుపోవడంతో చిన్నారి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామానికి చెందిన వీర్ల గోవర్ధన్‌ సునీత దంపతుల రెండో కుమారుడు సందీప్‌ (1) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆదివారం తల్లి అన్నం తినిపిస్తుండగా ముద్ద గొంతుకు అడ్డుపడింది. దీంతో శ్వాస పీల్చుకోలేక కొట్టుమిట్టాడాడు. దీంతో సందీప్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. పుట్టిన రోజునాడే చిన్నారి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

వెబ్దునియా పై చదవండి