గోవాలో ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం ఇవ్వని ప్రజలను ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ శాపనార్థాలు పెట్టారు. రాజీనామా సమర్పించిన అనంతరం లక్ష్మీకాంత్ పర్సేకర్ మాట్లాడుతూ ‘గోవా ప్రజలు తప్పు చేశారని నేను భావిస్తున్నా. వచ్చే ఐదేళ్లపాటు వారు పశ్చాత్తాప పడతారు’అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి లక్ష్మీకాంత్ పర్సేకర్ మండ్రెమ్ స్థానం నుంచి పోటీ చేసి ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. పర్సేకర్ శనివారం గవర్నర్‌కు రాజీనామాను సమర్పించారు.
పణజీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అతి చిన్నదైన గోవాలో ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం సంపాదించలేకపోయింది. గోవా అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 40 కాగా అధికారం చేపట్టడానికి కావలసిన కనీస స్థానాలు 21. 17 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌కు 4 సీట్ల దూరంలో ఆగిపోగా, బీజేపీ 13 చోట్ల విజయం సాధించింది. మహారాష్ట్రవాడీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)లు చెరో మూడు స్థానాల్లో గెలిచాయి. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయ బావుటా ఎగురవేశారు. ఎన్సీపీకి ఒక స్థానం లభించింది. ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
ప్రస్తుత అసెంబ్లీలో కేవలం 9 మంది సభ్యులను కలిగిన కాంగ్రెస్..ఈ ఎన్నికల్లో తన బలాన్ని దాదాపు రెట్టింపు చేసుకుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన దిగంబర్ కామత్, ప్రతాప్‌సిన్హ్ రాణే, రవి నాయక్, ల్యుజిన్హో ఫెలేరియోలు ఈ ఎన్నికల్లో భారీ విజయాలను అందుకున్నారు. హంగ్ రావడంతో చిన్న పార్టీలైన జీఎఫ్‌పీ, ఎంజీపీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర వహించనున్నాయి. స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ మద్దతుతోనే గెలవడం లాభించే అంశం.