లెబనాన్ ఘటన.. చెన్నై ప్రజల్లో ఆందోళన మొదలైంది.. ఎందుకంటే?

గురువారం, 6 ఆగస్టు 2020 (20:27 IST)
లెబనాన్ ఘటన నేపథ్యంలో.. తమిళనాడు రాజధాని చెన్నైలో ఏళ్ల తరబడి సుమారు 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ని నిల్వ ఉంచడం ప్రస్తుతం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. బీరూట్‌ సంఘటన చోటుచేసుకున్న తరుణంలో చెన్నై పోర్టు స్థానికులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు దీనిపై స్పందించారు. 
 
చెన్నై నగరం బయట సుమారు 700 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందని.. అది కస్టమ్స్ శాఖ కంట్రోల్‌లో ఉందని చెప్పారు. బాణాసంచా, ఎరువుల తయారీలో వినియోగించే ఈ పేలుడు పదార్థాన్ని ఫైర్‌వర్క్‌ను.. పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే శివకాశిలోని ఓ గ్రూపు కోసం ఉద్దేశించినదన్నారు. 2015లో ఈ అమోనియం నైట్రేట్‌ని చెన్నై పోర్టులో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 
 
మొత్తం 36 కంటెయినర్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఒక్కో కంటెయినర్ లో దాదాపు 20 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందన్నారు. దీన్ని శ్రీ అమ్మాన్ కెమికల్స్ అనే సంస్థ అక్రమంగా దిగుమతి చేసుకుందని కస్టమ్స్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై తాము కోర్టుకెక్కామని.. గత ఏడాది నవంబరులోనే కోర్టు రూలింగ్ ఇచ్చిందన్నారు. త్వరలోనే వేలం వేస్తామని కస్టమ్స్ అధికారి వివరణ ఇచ్చారు. 
 
అసురక్షిత పద్దతిలో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రైట్‌ బీరూట్‌లో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 135 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు