దేశ పారిశ్రామికదిగ్గజం, అపరకుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్‌లో ఈ వేడుకలను కన్నులపండుగగా నిర్వహించారు. మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్రపరిశ్రమతో పాటు పలువురు సినీ సెలెబ్రిటీలు, దేశ విదేశీ క్రికెటర్లు, ఐటీ కంపెనీల యజమానులు, దేశ పారిశ్రామిక వేత్తలు ఇలా అన్ని రంగాల వారు తరలివచ్చారు.
ఈ వేడుకకు వచ్చిన అతిథులకు ఏర్పాట్లతో పాటు వేడుక కోసం ప్రత్యేకంగా సెట్టింగ్‌లు వేయించి మరీ ఈ వేడుకను నిర్వహించారు. అన్నదానంతో మొదలైన వేడుకలకు హస్తాక్షర్‌తో ముగింపు పలికారు. అయితే, ఈ వేడుక కోసం అంబానీ ఎంత ఖర్చు చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
సినిమా సెట్టింగ్‌లను తలపించేలా వేసిన సెట్టింగులు, అతిథుల కోసం ఫైవ్ స్టార్ హోటల్‌ను మరిపించేలా చేసిన ఏర్పాట్లకు.. మొత్తంగా కలిపి ఈ వేడుకకు ముఖేశ్ అంబానీ అక్షరాలా రూ.1260 కోట్ల నుంచి రూ.1300 కోట్ల మేరకు ఖర్చు చేసినట్టు అంచనా వేస్తున్నారు. అయితే, వాస్తవంలో మాత్రం ఈ ఖర్చు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.