ఎన్నారై వలలోపడి మోసపోయిన మహిళా న్యాయవాది!

గురువారం, 8 ఏప్రియల్ 2021 (12:12 IST)
సోషల్ మీడియా మాయలో పడి సామాన్య పౌరులే కాదు.. విద్యావంతులు కూడా మోసపోతున్నారు. తాజాగా ఓ మహిళా న్యాయవాది సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఎన్నారైను నమ్మి మోసపోయింది. అప్పటికే వివాహమై పిల్లలున్న ఆ ఎన్నారై.. మహిళా న్యాయవాదిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తీరా అతని బండారం బయటపడటంతో ఆమె ముఖం చాటేసింది. దీంతో తనలోని మరో కోణాన్ని ఎన్నారై బయటపెట్టాడు. అప్పటికిగానీ తాను మోసపోయాననే విషయాన్ని ఆ మహిళా న్యాయవాది గ్రహించలేకపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతాన్ని పరిశీలిస్తే, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉండే అమేజ్ లోఖండ్‌వాలా అనే ఎన్నారైతో ఢిల్లీ దర్వాజాలోని సలాత్వాద్‌కు చెందిన 29 ఏళ్ల మహిళా న్యాయవాదికి గతేడాది ఏప్రిల్‌లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ చాటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఒకరోజు తనకు 34 ఏళ్లని, ఇంకా పెళ్లి కాలేదని, మంచి అమ్మాయి కోసం చూస్తున్నట్లు న్యాయవాదితో లోఖండ్‌వాలా చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆమెను నమ్మించేందుకు ఏకంగా ఓ నకిలీ బర్త్ సర్టిఫికేట్ కూడా పంపించాడు. అది చూసిన ఆమె నిజం అని నమ్మేసింది. ఆ తర్వాత లోఖండ్‌వాలాను పెళ్లి చేసుకునేందుకు సమ్మతించింది. దాంతో ఆమె ఫొటోలు అడిగి తీసుకున్నాడు. అలాగే తన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది. 
 
ఈ క్రమంలో ఒకరోజు లాయర్‌కు ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. లోఖండ్‌వాలాకు వివాహమైందని, అతని వయస్సు 48 ఏళ్లని, 17 ఏళ్ల కూతురు కూడా ఉన్నట్లు ఆమె చెప్పింది. అది విన్న న్యాయవాదికి మైండ్‌బ్లాంక్ అయింది. వెంటనే ఈ విషయమై లోఖండ్‌వాలాను నిలదీసింది. దాంతో తనకు అసలు పెళ్లి కాలేదని, నీకు ఫోన్ చేసిన మహిళ నా అన్నయ్య భార్య అని, వారిద్దరికి సంబంధించిన ఓ పెళ్లి ఫొటోను కూడా లోఖండ్‌వాలా ఆమెకు పంపించాడు. 
 
ఇదిలాఉండగా.. కొన్ని రోజుల తర్వాత ఇంతకుముందు లాయర్‌కు ఫోన్ చేసిన మహిళ ఈసారి వాట్సాప్ వీడియో కాల్ చేసింది. అందులో లోఖండ్‌వాలా పక్కన ఓ మహిళ ఉండడం కనిపించింది. అందులో కనిపిస్తున్న మహిళనే అతని భార్య అని వీడియో కాల్ చేసిన మహిళ చెప్పింది. 
 
దాంతో అప్పటి నుంచి తనను మోసం చేసిన లోఖండ్‌వాలాతో ఆమె మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలో అతగాడు తన వద్ద ఉన్న ఆమె ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించి అంతర్జాలంలో పెట్టాడు. పైగా ఆమెను వ్యభిచారిగా పేర్కొన్నాడు. నెట్టింట ఆ ఫొటోలు చూసిన బాధితురాలు కరంజ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తుజరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు