అది పుణేలోని ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీ. ఎంఎస్సి పూర్తి చేసిన నికీషా కంపెనీకి మొదటిసారి బయోడేటాతో ఉద్యోగానికి వెళ్ళింది. ఇంటర్వ్యూ చేస్తున్న బాస్ ఆమెను సెలక్ట్ చేశాడు. మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం రావడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది నికీషా. తన ఉడ్బీకి పెద్ద పార్టీ ఇచ్చింది. ఆ తరువాత వారం రోజుల పాటు కంపెనీలో ప్రశాంతమైన ఉద్యోగం.
ఆ తరువాత అసలు సమస్య ప్రారంభమమైంది. బాస్ స్టీఫెన్ నికీషాను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. కోరిక తీర్చమని హింసించేవాడు. దీంతో స్టీఫెన్ పైన చేయి చేసుకుంది నికీషా. అయినా సరే అతనిలో ఎలాంటి మార్పు కలుగలేదు. ఒకరోజు నికీషా సెల్ ఫోన్‌కు కొన్ని మార్ఫింగ్ వీడియోలు వచ్చాయి. బాస్‌తో ఆమె దగ్గరగా కూర్చున్నట్లు, సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలో ఉన్నాయి. దీంతో ఆమె షాక్.
బాస్‌ను ఏమనలేక, ఉద్యోగం చేయలేక, జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పలేక ఆమెలో ఆమే మథనపడిపోయింది. గతంలోలా నికీషా తనతో క్లోజ్‌గా లేకపోవడం గమనించాడు ఉడ్బీ రాహుల్. తనకు చెప్పకుండా ఫోన్‌ను చూశాడు. అప్పుడు అర్థమైంది. నికీషా పడుతున్న ఆవేదన తెలిసొచ్చింది. స్టీఫెన్‌ను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. ఒకరోజు పక్కా ప్లాన్‌తో కార్యాలయంలోకి వెళ్ళి స్టీఫెన్‌ను గొంతు నులిమి చంపేసి పరారయ్యాడు. పోలీసులకు స్టీఫెన్ మర్డర్ ఒక మిస్టరీగా మారింది. అయితే నికీషాతో పాటు ఆఫీస్ లోని కొంతమంది సిబ్బందిని విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడు రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.