జస్టిస్‌ కర్ణన్‌కు ఆర్నెల్ల జైలు.. వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ సుప్రీం ఆదేశం

బుధవారం, 10 మే 2017 (03:16 IST)
కలకత్తా హైకోర్టుకు చెందిన వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్‌ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద ఆర్నెల్లు జైలుశిక్ష విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ‘జస్టిస్‌ కర్ణన్‌ కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో పాటు న్యాయవ్యవస్థను, న్యాయపక్రియను ధిక్కరించినందున ఆయనకు శిక్ష విధించాలని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్పు తక్షణం అమలు చేసేందుకు ఆయన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. 
 
జస్టిస్‌ కర్ణన్‌ జారీచేసే తదుపరి ఆదేశాలను ప్రచురించొద్దని జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ జె చలమేశ్వర్, జస్టిస్‌ రంజన్‌ గగోయ్, జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ పీసీ ఘోష్, జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌ల ధర్మాసనం మీడియాకు ఆదేశాలు జారీచేసింది. కాగా తనపై విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనంలోని సభ్యులకు సోమవారం తన ఇంట్లోనే విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద ఐదేళ్ల చొప్పున కారాగార శిక్ష విధిస్తూ జస్టిస్‌ కర్ణన్‌ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
 
వివాదాస్పద ప్రవర్తన కారణంగా మద్రాస్‌ హైకోర్టులో పనిచేస్తున్న కర్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే ఆ ఆదేశాలను కర్ణన్‌ ధిక్కరించడంతో ఆయనకు ఎటువంటి విధులూ అప్పగించొద్దని మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. తమ ఆదేశాలు పాటించనందుకు కోర్టు ధిక్కరణకేసులో తమ ముందు హాజరుకావాలంటూ మార్చి 10న సుప్రీంకోర్టు జస్టిస్‌ కర్ణన్‌కు బెయిలబుల్‌ వారంట్‌ జారీచేసింది.
 
ఆయన హాజరు కాకపోవడంతో నెల తరువాత తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ మరో నోటీసు జారీచేసింది. మార్చి 31న సుప్రీంకోర్టుకు హాజరైన జస్టిస్‌ కర్ణన్‌ తన అధికారాలను పునరుద్ధరించాలని కోరగా అందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో తనను జైల్లో పెట్టినా సరే మరోమారు బెంచ్‌ ముందు హాజరుకానని ఆయన స్పష్టం చేశారు. 
 
దీంతో అతని మానసిక స్థితిపై పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం మే 1న ఆదేశాలు జారీచేసింది. అయితే మే 4న జస్టిస్‌ కర్ణన్‌ వైద్యపరీక్షలు చేయించుకోవడానికి తిరస్కరిస్తూ తను మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ లేఖ ఇచ్చారు.  
 

వెబ్దునియా పై చదవండి