కరోనా రోగులను ఎక్కడైనా చేర్చుకోవాల్సిందే : కేంద్రం

సోమవారం, 10 మే 2021 (16:43 IST)
కరోనా రోగులను ఏ రాష్ట్రంలోనైనా చేర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. పలు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల కొవిడ్ పేషెంట్లను అడ్డుకుంటున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి స్పష్టత నిచ్చింది. 
 
కొవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా, కొవిడ్ పాజిటివ్ టెస్టు రిపోర్టు లేకపోయినా కరోనా రోగిని చేర్చుకోబోమని ఏ ఆసుపత్రి నిరాకరించరాదని స్పష్టంచేసింది. అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆసుపత్రులు ఈ మేరకు నడుచుకోవాలని పేర్కొంది.
 
కొవిడ్ నిర్ధారణ అయిన, కొవిడ్ అనుమానితుల  అంశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మూడంచెల మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించినట్టు తన అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
అంతేకాకుండా, దేశంలో పరిమితంగానే వ్యాక్సిన్ డోసుల లభ్యత ఉన్నందున ఒక్క విడతలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ అమలు చేయలేకపోతున్నామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.
 
మరోవైపు, దేశంలో కరోనా సంక్షోభం నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ ప్రారంభించడం తెలిసిందే. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అలాగే, దేశ వ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సిన్ ప్రక్రియలో కూడా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని కేంద్రం మరో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు