ఓపీ Vs శశికళ.. 8 లేదా 9న ముహూర్తం.. అమ్మ స్థానంలో సీఎంగా శశికళ?

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (12:15 IST)
అన్నాడీఎంకే మాజీ చీఫ్, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి అనంతరం తమిళనాడు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. అమ్మ మరణంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన వీకే శశికళ.. తాజాగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జయలలిత మరణానంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన పన్నీర్‌సెల్వం స్థానంలో... ఈ నెల 8 లేదా 9న శశికళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. 
 
ఈ మేరకు ఆదివారం జరిగే ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో శశికళను సీఎం చేయాలనే దానిపై నేతలు ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. మరోవైపు శశికళకు అత్యంత విధేయురాలైన అధికారి షీలా బాలకృష్ణన్‌తో సహా ముగ్గురు ఉన్నతాధికారులను రాజీనామా చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం కోరినట్టు చెబుతున్నారు.
 
జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పడు పాలనా బాధ్యతలన్నీ షీలానే చూసుకున్నారు. శుక్రవారం రాత్రి ఆమెను రాజీనామా చేయాలని పన్నీర్ సెల్వం కార్యాలయం కోరినట్లు సమాచారం. అయితే శుక్రవారం మాజీ మంత్రి కేఏ సెంగోట్టాయన్, మాజీ మేయర్ సైదయ్ ఎస్ దురైసామిలను పార్టీ కార్యదర్శులుగా శశికళ నియమించారు. పార్టీలోని అసమ్మతి వాదులకు చెక్ పెట్టేందుకే వీరిని తెరపైకి తీసుకువచ్చినట్టు కనిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి