యావత్ దేశ ప్రజలను దిగ్భ్రమకు గురిచేసిన సుప్రీంకోర్టు వివాదం టీ కప్పులో తుఫానులా సమసిపోనుంది. ఇందుకోసం రాజీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా, ప్రధాన న్యాయమూర్తే ఓ మెట్టుదిగి.. తనపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో మంగళవారం సమావేశమై చర్చలు జరిపారు.
సుప్రీంకోర్టులో పాలన సరిగా జరగడం లేదంటూ ఈనెల 13వ తేదీన నలుగురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌పై తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. వీరిలో జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకుర్, కురియన్ జోసెఫ్‌లు ఉన్నారు.
ఈ నేపథ్యంలో నలుగురు జడ్జీలతో మంగళవారం ఉదయం చీఫ్ జస్టిస్ కలిశారు. సీజేఐ చాంబర్‌లో 15 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశ వివరాలు బయటకు వెల్లడికాకపోయినప్పటికీ బుధవారం కూడా మరోమారు భేటీ జరిగే అవకాశాలున్నాయి. అయితే ఐదుగురు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం పాలనకు భంగం జరగకుండా చూడాలని వారంతా నిర్ణయానికి వచ్చేశారు.