ఫేస్‌బుక్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు

ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (08:17 IST)
ఫేస్‌బుక్‌కు ఢిల్లీ అసెంబ్లీ సమన్లు జారీ చేసింది. భారత్‌లో ఫేస్‌బుక్‌ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజిత్‌ మోహన్‌కు ఢిల్లీ అసెంబ్లీ శాంతి భద్రతల కమిటీ సమన్లు పంపించింది.

సెప్టెంబర్‌ 15న విధానసభ ప్రాంగణంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే రాఘవ్‌ నేతృత్వంలోని కమిటీ నోటీసులు జారీ చేసింది. పలువురి నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగానే ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేసినట్లు కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఫిబ్రవరి 31న ఈశాన్య ఢిల్లీలో మత కలహాలు చోటుచేసుకోగా ఆ అల్లర్లలో 53 మంది మరణించారు. 400 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఆ కలహాలను తీవ్రతరం చేసేందుకు ఫేస్‌బుక్‌ సహకరించిందని, విద్వేషపూరిత ప్రసంగాలను చూసీచూడనట్లు వదిలేసిందని ఆగస్టు 31న జరిగిన రెండో విచారణలో కమిటీ తేల్చింది.

బీజేపీకి అనుకూలంగా ఫేస్‌బుక్‌ పనిచేస్తోందంటూ ఆగస్టు 14న అమెరికాకు చెందిన ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బలపరుస్తూ అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదుల ఆధారంగానే కమిటీ ఈ విచారణను చేపట్టి ఉపాధ్యక్షుడికి సమన్లు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు