ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన బ్లాక్ మనీ ఆపరేషన్‌కు పారిశ్రామికదిగ్గజం రతన్ టాటా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ ఆపరేషన్ వల్ల దేశంలో నల్లధనం, అవినీతిని పూర్తిగా అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అదేసమయంలో పెద్ద నోట్ల రద్దుతో ఎదురైన కష్టాల నుంచి సామాన్య ప్రజానీకాన్ని ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదిన సత్వర చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీకి రతన్ టాటా సూచన చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్విట్టర్ ద్వారా కొన్ని సూచనలు చేశారు.
పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులుపడుతున్న ప్రజల కష్టాలను తగ్గించడానికి సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో అత్యవసర వైద్యసేవలు అందక బాధలు పడుతున్న పేదల కోసం ప్రభుత్వం ప్రత్యేక సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయవిపత్తులు సంభవించినపుడు చేపట్టే అత్యవసర సహాయక చర్యల్ని ఈ సమయంలో కూడా పేదలకు అందించాలన్నారు.
నగుదును అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని అభినందించిన ఆయన సామాన్య మానవుడి నిత్యావసరాల గురించి మర్చిపోకూడదని సలహా ఇచ్చారు. అలాగే డీమానిటైజేషన్ కార్యక్రమం అమలుకు మరిన్ని ఆలోచనలు చేయాలన్నారు. కాగా నవంబరు 8న ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుకు మద్దతు తెలిపిన బడా పారిశ్రామిక వేత్తలో రతన్ టాటా ఒకరు.