నోట్ల రద్దు విషయంలో తప్పు చేస్తే నడి బజారులో ఉరి తీయండి : ప్రధాని నరేంద్ర మోడీ

సోమవారం, 14 నవంబరు 2016 (11:01 IST)
తాను తప్పు చేస్తే నడి బజారులో ఉరితీయండి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. నల్లధనం నిర్మూలనలో పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ఎంతో ముఖ్య‌మైన‌ద‌ని, ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల తనను హతమార్చేందుకు నల్లధన కుబేరులు ప్రయత్నిస్తున్నారని, అయినప్పటికీ.. తాను వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 
 
గోవాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ త‌న‌కు ప్ర‌జ‌లు అవినీతిని అంతం చేసేందుకే అధికారం అప్ప‌జెప్పార‌ని, మ‌రి దాన్ని అంతం చేయ‌కుండా ఎలా ఉండగలనని ప్రశ్నించారు. ప్ర‌స్తుతం సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూస్తుంటే త‌న‌కు కూడా బాధ వేస్తోంద‌ని, తాను ఏదైనా తప్పు చేసివుంటే ఏ శిక్షకైనా సిద్ధమ‌న్నారు. తాము తీసుకున్న‌ పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణయంతో 50 రోజుల పాటు కొన్ని ఇబ్బందులు ఉంటాయ‌న్నారు. బినామీ ఆస్తులపై చర్యలు తీసుకుంటామ‌న్నారు. 2జీ స్కామ్‌ నిందితులు కూడా ఇప్పుడు పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వ‌ద్ద‌కు వెళ్లి క్యూలో నిల‌బ‌డుతున్నార‌న్నారు. న‌ల్ల‌ధ‌నాన్ని అంతం చేసే వ‌ర‌కు తాను విశ్ర‌మించ‌న‌ని ఆయన విస్పష్ట ప్రకటన చేశారు. 
 
ఇకపోతే... త‌న‌ మంత్రివర్గంలో నవరత్నాలు ఉన్నాయని, అందుకు తాను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. వారిలో ఒకరు గోవాకి చెందిన కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ అని అన్నారు. పారిక‌ర్ ఎంతో స‌మర్థ‌వంతంగా ప‌నిచేస్తున్నార‌ని, సుమారు 40 ఏళ్లుగా ఆలస్యం అవుతున్న ఎన్నో సమస్యలకు ప‌రిష్కారాలు చూపించార‌ని మోడీ కొనియాడారు. వ‌న్ ర్యాంక్ వ‌న్ పింఛ‌న్‌ విధానంలో పారిక‌ర్‌ ఎంతో నేర్పును చూపార‌ని ఆయ‌న అన్నారు. పారికర్ చూసిన‌ పరిష్కార మార్గాల‌తో తాము ఇప్పుడు వీలైనంత త్వ‌రగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ల‌గ‌లుతున్నామ‌ంటూ కితాబిచ్చారు.

వెబ్దునియా పై చదవండి