అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నేపథ్యంలో, డీఎంకే బలపడేందుకు రంగం సిద్ధమవుతోంది. అన్నాడీఎంకే, లేకుంటే డీఎంకే అన్న తరహాలోనే తమిళనాడు రాజకీయాలు సాగుతూ వచ్చేవి. ద్రవిడ పార్టీలకే తమిళ ఓటర్లు పట్టం కడుతూ వచ్చేవారు.
అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించి, ఆ పార్టీలో అధికార సంక్షోభం లేదా నేతల్లో అసంతృప్తులు బహిర్గతమయ్యేంతవరకూ వేచిచూడాలన్నది కరుణానిధి సారథ్యంలోని డీఎంకే పార్టీ తాజా వ్యూహంగా తెలుస్తోంది. అన్నాడీఎంకేలో ఇప్పటికే లుకలుకలు తలెత్తాయా అనేది ఇంకా బయటపడకున్నా కొద్దిపాటి అసంతృప్తులు మొదలైనట్టేనని గత నాలుగైదు రోజుల పరిణామాలను బట్టి కొందరు అంచనా వేస్తున్నారు.
అన్నాడీఎంకేలో పరిణామాలపై ఎవరైనా అసంతృప్తులు ఉంటే వారు సహజంగానే డీఎంకే వైపు మళ్లుతారని, ఇప్పుడే హంగామా చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అన్నాడీఏంకేకు దగ్గరకావడం ద్వారా తమిళనాట బలంగా వేళ్లూనుకునే ప్రమాదం పొంచి ఉందని డీఎంకే అధిష్ఠానం భావిస్తోంది.