తమిళనాడు శాసనసభలో చివరకు చొక్కాలు చించుకుంటే కాని విశ్వాస పరీక్ష పూర్తి కాలేదు. డీఎంకే సభ్యులు స్పీకర్ ధనపాల్ చొక్కా చింపితే, ప్రతిపక్ష నేత స్టాలిన్ తన చొక్కా కూడా చింపారంటూ ఆయన తన వాహనం నుంచి దిగడం తమిళనాడు రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారాయో అర్థమవుతుంది. స్పీకర్‌పై డీఎంకె సభ్యులు గందరగోళం సృష్టించాక, వారందరిని బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత వారు సభ నుంచి వెళ్ళలేదు. దాంతో మార్షల్స్ వారిని బయటకు పంపించే ప్రయత్నాలు చేశారు. స్టాలిన్‌ను సైతం వారు మోసుకెళ్ళగా కొంత తోపులాట జరిగింది. ఈ మధ్యలో ఎప్పుడు చొక్కా చిరిగిందో కానీ స్టాలిన్ గుండీలు లేకుండా వాహనం దిగి కనిపించారు.
సభలో తనపై దాడి చేశారని స్టాలిన్ ఆరోపించగా, దీనిపై తమిళనాడు గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. స్పీకర్ తానే చొక్కా చింపుకుని డిఎంకే ఎమ్మెల్యేలపై నింద వేస్తున్నారని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. కాగా పళణిస్వామి ప్రభుత్వం 122 ఓట్లతో మెజారిటీని నిరూపించుకుందని స్పీకర్ ప్రకటించారు. అన్నాడీఎంకే నేత పన్నీర్ సెల్వం పభ్యులు 11 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ చొక్కాలు చింపుకుంటే గానీ విశ్వాసపరీక్షలు పూర్తి కాలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
శాసనసభ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదంటున్నారు. ఇప్పటివరకు విదేశాల్లోని శాసనసభలలో గొడవలు పడడం, కొట్టుకోవడం చూశాం. మన దేశంలోని తమిళనాడులో తప్ప మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి తమిళనాడులోనే తిరిగి ఇలాంటి సంఘటన జరగడం ప్రజాస్వామ్యానికి మచ్చ కలిగించేలా ఉందని భావిస్తున్నారు.