ఈ ప్రమాదానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని మహారాష్ట్రలోని విపక్షాలు మండిపడ్డాయి. బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై దృష్టి పెట్టడానికి బదులు రైల్వే స్టేషన్లలో కనీస వసతులు కల్పించి, ప్రయాణికుల భద్రత మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సూచించాయి.
ఇదే అంశంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందిస్తూ... ఇది ప్రభుత్వం, రైల్వేలు జరిపిన నరమేధం. పాతకాలం నాటి, శిథిలమైన పాదచారుల వంతెనలను ఆధునీకరించాలని ఎన్నిసార్లు కోరినా చర్యలు తీసుకోలేదు. రైల్వే వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ప్రభుత్వానికి సమయం లేదు. కానీ బుల్లెట్ రైళ్లను తీసుకొస్తానంటున్నది. ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని కోరారు.