వివరాల్లోకి వెళితే.. దక్షిణ బెంగళూరులోని కగ్గళిపురలో ఉంటున్న శ్రుతి గౌడ (32) ఇద్దరు పిల్లల తల్లి. రైల్వే గొల్లహళ్ళిలో పంచాయతీ అభివృద్ధి అధికారిణిగా పనిచేస్తోంది. ఆమె భర్త రాజేశ్ గౌడ (33). వీరిది సంపన్న కుటుంబమే. అమిత్ కేశవమూర్తి (34) న్యాయవాది, రాజకీయ నాయకుడు. ఈ రెండింటి కుటుంబాల మధ్య సంబంధాలున్నాయి.
ఇటీవలే కొత్త సంవత్సర వేడుకలు చేసుకున్నారు. కానీ ఇంతలోనే అమిత్ దారుణంగా హత్యకు గురయ్యాడు, అది చూసి శ్రుతి ఆత్మహత్య చేసుకుంది. అందుకు కారణం వీరిద్దరి మధ్య ఏర్పడిన బంధం గురించి శ్రుతి భర్త రాజేష్, ఆయన తండ్రి గోపాలకృష్ణ అనుమానించడమేనని తెలిసింది.
ఈ క్రమంలో శుక్రవారం శ్రుత కారులో బయల్దేరింది. తుమకూరు రోడ్‌లోని మదనాయకనహళ్ళిలో అమిత్‌ను ఆ కారులో ఎక్కించుకుంది. కొంత దూరం వెళ్ళాక కథ అడ్డం తిరిగింది. రాజేశ్, గోపాలకృష్ణ వేరొక కారులో వీరిద్దర్నీ వెంబడించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
వీరిద్దర్నీ బయటకు రమ్మని రాజేశ్ గద్దించాడని అంటున్నారు. గోపాలకృష్ణ వద్ద లైసెన్స్‌డ్ తుపాకీ ఉంది. ఆ తుపాకీ నుంచి రెండు తూటాలు అమిత్ ఛాతీలో దిగాయి. అయితే ట్రిగ్గర్‌ను ఎవరు నొక్కారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. అమిత్ హత్యను చూసిన శ్రుతి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.