మీరు వర్జినా..? బ్యాచిలరా..? మీకెంతమంది భార్యలు.. ఇత్యాది ప్రశ్నలు మీకు ఎపుడైనా ఎదురైవుండవు. కానీ, బీహార్‌లోని ఇందిరాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మాత్రం ఈ తరహా ప్రశ్నలతో ఓ దృవీకరణ పత్రాన్ని తయారు చేసింది. ఇది వివాదాస్పదం అయినా.. ఆ ఉన్నత విద్యా సంస్థ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ వివరాలను పరిశీలిస్తే..
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో ఇందిరా గాంధీ ఇనిస్టిటిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగుల నుంచి వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం ఓ డిక్లరేషన్ ఫాంను తయారు చేసింది. ఇందులో భర్తను కోల్పోయారా? లేక బ్యాచిలరా? లేక వర్జినా? మీకెంత మంది భార్యలు అనే ప్రశ్నలు ఉన్నాయి. ఇవేనా... ఈ డిక్లరేషన్‌లో ఇంకా అనేక తికమక ప్రశ్నలూ ఉన్నాయి. ఈ డిక్లరేషన్ ఫామ్ వివాదాస్పమైంది.
దీంతో ఇనిస్టిట్యూట్ మెడికల్ సూపరిండెంట్ మనీష్ మండల్ స్పందించారు. ఫాంను రూల్స్ ప్రకారమే తయారు చేసినట్టు చెప్పారు. ఉద్యోగి చనిపోతే, క్లెయిమ్స్ ఎవరి వెళ్లాలన్న ఉద్దేశంతోనే అలాంటి ప్రశ్నలు వేసినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం, రాజ్యాంగమే రూల్స్‌ను తయారు చేస్తాయని, వాళ్లు మారిస్తే, తాము మారుస్తామని ఆయన సమాధానమివ్వడం కొసమెరుపు.