సింహాల గుంపు మధ్యలో శిశువుకు జన్మనిచ్చిన మహిళ ఎక్కడ?

శనివారం, 1 జులై 2017 (11:13 IST)
సింహాల గుంపుకు మధ్యలో ఓ మహిళ ఓ శిశువుకు జన్మనిచ్చిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని అమెరేలి జిల్లా జఫ్రాబాద్ తాలుకా లన్సాపూర్ గ్రామానికి చెందిన నిండు గర్భిణి అయిన మహిళకు బుధవారం రాత్రి అకస్మాత్తుగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అక్కడ నుంచి సమీపంలోని ఆస్పత్రికి బయల్దేరారు.
 
కానీ గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణించే సరికి రోడ్డుపై సింహాల గుంపు కనిపించింది. 11-12 సింహాలు రోడ్డుకు అడ్డంగా నిల్చున్నాయి. దీంతో అంబులెన్స్‌ను నిలిపివేశారు. సింహాలు అక్కడ నుంచి వెళ్లాక బయల్దేరాలని నిర్ణయించారు. కానీ అవి కదిలేలా కనిపించలేదు. మరోవైపు ఆంబులెన్స్‌లోని మహిళకు తీవ్ర రక్తస్రావం ఏర్పడింది. నొప్పులు కూడా అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే మహిళకు ప్రసవం చేయాలని అంబులెన్స్ సిబ్బంది నిర్ణయించారు. ఆ వెంటనే వారు ఫిజిషియన్‌తో ఫోన్లో మాట్లాడి ఆయన సూచనల మేరకు డెలివరీ చేశారు. 
 
ఇందుకు 25 నిమిషాలు పట్టిందని అంబులెన్స్ సిబ్బంది వెల్లడించారు. అనంతరం అంబులెన్స్ డ్రైవర్ నెమ్మదిగా వాహనాన్ని ముందుకు కదిలించాడు. ముందుకు వస్తున్న వాహనాన్ని చూసి సింహాలు కూడా నెమ్మదిగా రోడ్డుపై నుంచి కదిలాయి. దీంతో మహిళ, ఆమె శిశువును జఫ్రాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి