ప్రస్తుతం పాకిస్తాన్‌లో భాగమై ఉన్న సింధ్ ప్రాంతం భారత్‌లో భాగం కానంతవరకు భారదదేశం అసంపూర్ణ దేశంగా కనిపిస్తుందని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌లోని ఒక రాష్ట్ర రాజధానిగా ఉంటున్న కరాచీ నగరం భారత్‌లో భాగం కాకుండా ఉన్నందుకు చాలా బాధగా ఉందని అద్వానీ చెప్పారు. కరాచీలో దాదాపు 9 దశాబ్దాల క్రితం ఒక సింధీ కుటుంబంలో జన్మించిన అద్వానీ తన మూలాలు పరాయి దేశంలో ఉంటున్నందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కరాచీ కానీ, సింధ్ కాని భారత్‌లో భాగం కావు అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధ కలుగుతుంటుంది. సింధ్ ప్రాంతంలో ఉన్నప్పుడు నా బాల్యంలో ఆర్ఎస్ఎస్‌లో చురుగ్గా పనిచేసేవాడిని. తల్చుకుంటేనే నాకు విచారం, ఉద్వేగం కలుగుతుంటాయి. ఒకటి మాత్రం చెప్పగలను. సింధ్ లేని భారత్ అంసపూర్ణ దేశమేనన్నది నా ప్రగాఢ విశ్వాసం అన్నారు అద్వానీ.
అద్వానీ తన బాల్యం, సింధ్‌లో తన గత జీవిత జ్ఞాపకాలు తల్చుకుని భావోద్వేగంతో సింధ్ భారత్‌లో భాగమై ఉండాలని ప్రకటించి ఉండవచ్చు కానీ, అద్వానీ ప్రకటనపై పాకిస్తాన్ స్పందన ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించుకోవాల్సిందే. వృద్ధాప్యంలో అద్వానీ వ్యాఖ్యలను కాస్త తేలిగ్గా తీసుకుంటేనే మంచిదేమో మరి.