జయ చనిపోయినపుడే సీఎం పగ్గాలు చేపట్టాలన్నారు.. పన్నీర్ నమ్మినబంటు : శశికళ

సోమవారం, 6 ఫిబ్రవరి 2017 (08:47 IST)
ముఖ్యమంత్రి దివంగత జయలలిత ఆస్పత్రిలో చనిపోయిన మరుక్షణమే తనను పార్టీ పగ్గాలతో పాటు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని పార్టీ నేతలంతా ఒత్తిడి తెచ్చారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చెప్పుకొచ్చారు. కానీ, ఆ పరిస్థితుల్లో తాను సీఎం పదవిని చేపట్టేందుకు అంగీకరించలేదని గుర్తుచేశారు. 
 
శాసనసభాపక్షం నేతగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆమె పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత జయలలిత ఆశయాలను తప్పకుండా పాటిస్తానని, ఆమె చూపిన బాటలోనే పయనిస్తానని హామీ ఇచ్చారు. జయ మరణంతో కంచుకోటలాంటి పార్టీ ముక్కలవుతుందని ఎదురు చూసిన ప్రత్యర్థుల కలలను వమ్ము చేస్తూ ఐకమత్యంగా పార్టీని బతికించారంటూ నేతలపై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
ముఖ్యంగా.. ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం అమ్మకు నమ్మినబంటు మాత్రమే గాక పార్టీ పట్ల అత్యంత విశ్వాసపాత్రుడిగా పని చేశారని, డిసెంబరు 5వ తేదీన అమ్మ మరణించిన రోజు ఆ దుఃఖ సమయంలో కూడా పార్టీ ముక్కలు కాకుండా కాపాడేందుకు ఏం చేయాలన్నదానిపై పన్నీర్‌సెల్వం తనతో మాట్లాడారన్నారు. అప్పుడు ప్రధాన కార్యదర్శిగానూ, ముఖ్యమంత్రిగానూ బాధ్యతలు చేపట్టాలని ఆయన తనపై ఒత్తిడి చేశారన్నారు. 
 
అయినా కూడా పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు, కార్యకర్తలు తనను ఒత్తిడి చేయడంతో పాటు పార్టీ సర్వసభ్యసమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పార్టీ పదవిని స్వీకరించానని, పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి పదవుల్లో ఒక్కరే వుంటే బావుంటుందని అందరూ కోరుకోవడంతో ఇప్పుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించానన్నారు. కోట్లాదిమంది కార్యకర్తల అభీష్టం మేరకు ఎమ్మెల్యేలు తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని, అందుకే దీనిని తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నట్లు ఎమ్మెల్యేల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి