అపోలోలో మూడు వారాలకు పైగా చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత కోలుకుంటున్నారని.. ఆమె త్వరలో డిశ్చార్జ్ కానున్నారని వార్తలు వస్తున్నాయి. సింగపూర్, లండన్, ఎయిమ్స్ వైద్యుల సమక్షంలో అపోలోలో వైద్యం పొందిన జయలలిత ఆరోగ్య పరిస్థితి మెరుగైందని.. అందుకే ఆమెను ఈ నెల 26 లేదా 27వ తేదీన డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నట్లు అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి గురువారం ప్రకటించారు. కానీ అపోలో ఆస్పత్రి మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా జయలలిత ఆస్పత్రిలో చేరి గురువారానికి 29 రోజులు పూర్తయ్యాయి. సీఎం జయ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శివకుమార్ నేతృత్వంలో ప్రారంభమైన చికిత్సలో లండన్ ఎయిమ్స్, సింగపూర్ వైద్యులు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం జయలలితకు ఫిజియోథెరపీ మాత్రమే కొనసాగుతోంది. కాగా, జయ డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకునేందుకు లండన్ డాక్టర్ రిచర్డ్ మరో నాలుగు రోజుల్లో చెన్నై రానున్నట్లు సమాచారం.
అమ్మ కోలుకోవాలని కోరుతూ అనేక ఆలయాల్లో అన్నాడీఎంకే శ్రేణులు ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మ డిశ్చార్జ్ కానున్నారనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది. అమ్మ త్వరలో డిశ్చార్జ్ అయి సీఎంగా బాధ్యతలు చేపడతారని తెలుసుకున్న కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.