కేంద్ర మంత్రి ఉమాభారతిని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్‌లు కలిశారు. కృష్ణా జలాల పంపిణీపై అపెక్స్ కమిటీ ముందు వాదనలు వినిపించేందుకు ఇద్దరు చంద్రులు ఉమాభారతిని కలిసిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉమాభారతికి అభివందనం చేస్తూ, కేసీఆర్ గులాబీలతో కూడిన పుష్పగుచ్ఛాన్ని ఆమెకు అందజేశారు. చిరునవ్వు చిందిస్తూ.. ఉమాభారతి పుచ్చుకున్నారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న చంద్రబాబును కేసీఆర్‌కు చూపించారు. ఇద్దరు నేతలూ కరచాలనం చేసుకున్నారు. ఆ వెంటనే కేసీఆర్ తనకిచ్చిన గులాబీ ఫ్లవర్ బొకే నుంచి ఓ పువ్వును లాగి ఆమె చంద్రబాబుకు ఇచ్చారు. ఆపై మరో పువ్వును లాగి కేసీఆర్ చేతిలోనూ పెట్టారు. ఈ ఘటనను అక్కడున్న మంత్రులు దేవినేని ఉమ, హరీశ్ రావు ఇతర అధికారులు చిరునవ్వుతో తిలకించారు.
ఈ సందర్భంగా ఉమాభారతి మాట్లాడుతూ.. కృష్ణా జలాల అంశంపై నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మూడు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. కృష్ణా జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర వివాదంపైనా సమావేశంలో చర్చించారు. నదీ జలాల పంపకం అంశంలో వివాదాలకు పోకుండా.. సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలని ఉమాభారతి సూచించారు. నీటి లభ్యత ఆధారంగా అంచనా వేసి ఇరు రాష్ట్రాలకు దామాషా ప్రకారం నీటి పంపిణీని చేస్తామని ఉమాభారతి వెల్లడించారు.