పెళ్లైనప్పటికీ ప్రేమికుడికి దూరం చేసుకోలేకపోయిన ఓ వివాహితకు భర్త ముందే ప్రియుడితో వివాహమైన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. మహిళలపై అత్యాచారాలు, పరువు హత్యలు పెచ్చరిల్లిపోతున్న నేపథ్యంలో.. బీహార్‌లోని గ్రామ పెద్దలు హుందాగా నడుచుకున్నారు. ఓ వివాహితకు ఆమె ప్రేమిస్తున్న వ్యక్తితో వివాహం జరిపించారు. పాట్నాకి 80 కిలోమీటర్ల దూరంలోని మోతీపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సదరు మహిళకు ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగింది. రోజూ తన స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేది. వరసకు సోదరుడినని చెప్తూ ఇంటికి వస్తుండటంతో ఎవరికి అనుమానం కలగలేదు. కాగా బుధవారం రాత్రి పడకగదిలో వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉండగా ఆమె భర్త చూశాడు. దీంతో గ్రామస్తులు వివాహితతో పాటు ఆమె ప్రియుడిని పట్టుకుని చితకబాదారు.
ఈ వివాదంపై అమ్మాయిని పెద్దలు పంచాయతీ పెట్టగా.. భర్తతో కలిసి ఉండననీ, తన స్నేహితుడినే వివాహం చేసుకుంటానని చెప్పింది. ఇందుకు ఆమె భర్త కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో గ్రామ పెద్దలు భర్త సమక్షంలోనే ప్రియుడితో వివాహం జరిపించారు.