ముంబై నగరం మునిగిపోయింది .. ఒక్క మే నెలలోనే 107 యేళ్ల వర్షపాత రికార్డు కనుమరుగు

ఠాగూర్

సోమవారం, 26 మే 2025 (19:24 IST)
ముంబై మహానగరం మునిగిపోయింది. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై నగరంలో నీట మునిగింది. గత 107 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదై, సరికొత్త రికార్డును నెలకొల్పింది. ముఖ్యంగా, ఆదివారం అర్థరాత్రి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షంతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. దీంతో భారత వాతావరణ శాఖ పలు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. 
 
సోమవారం ఉదయం 11 గంటలకు బీఎంసీ పరిధిలోని అనేక ప్రాంతాలు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా దక్షిణ ముంబైపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపించారు. నారిమన్ పాయింట్‌ స్టేషన్‌లో 252 మిమీ, బైకుల్లా ఈ-వార్డులో 213 మిమీ, కొలాబా ప్రాంతంలో 207 మిమీ, డు-టకి స్టేషన్‌లో 202 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది. అలాగే, మెరైన్ లైన్స్, చందన్‌వాడీ, వర్లీ వంటి ప్రాంతాల్లో 170 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ వెల్లడించింది. 
 
కొలాబా అబ్జర్వేటరీ గణాంకాల మేరకు ఈ మే నెలలోనే ఇప్పటివరకు నమోదైన మొత్తం వర్షపాతం 295 మిల్లీమీటర్లని, ఇది గడిచిన 107 సంవత్సరాలలో మే నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం కావడం గమనార్హం. ఇంతకుముందు 1918వ సంవత్సరంలో మే నెలలో 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా, ఆ శతాబ్దపు రికార్డు ఇపుడు కనుమరుగైపోయింది. ఈ అసాధారణ వర్షపాతం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు