అటవీశాఖాధికారుల నిర్లక్ష్యం సామాన్య ప్రజలకు కోపం తెప్పించింది. అంతే మొసలి అటవీశాఖాధికారుల ఇంటి ముందు వదిలిపెట్టేశారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటన అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనానిని అద్దం పట్టింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక శివపురి ప్రాంతంలోని బాలి కాలనీ పక్కనే నీటి కొలను ఉంది. అందులో ఓ మొసలికి షికారు కెళ్లాలనిపించిందేమో మెల్లగా కాలనీలోకి ప్రవేశించింది. దాన్ని చూసి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానిక అటవీ శాఖ అధికారులకు ఫోన్లు చేసి విషయం చెప్పారు.
అయితే సహాయక సిబ్బంది మొసలిని పట్టుకునేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. గంటలు గడిచినా అటవీశాఖ సిబ్బంది జాడమాత్రం కనబడలేదు. దీంతో ప్రజలంతా ఏకమై.. అధికారికి బుద్ధిచెప్పాలనుకున్నారు. ఇక లాభం లేదనుకుని కాలనీ వాసులే.. ధైర్యం చేసుకుని.. మొసలిని బంధించి.. దాన్ని తీసుకెళ్లి అటవీ శాఖాధికారి ఇంట్లో వదిలిపెట్టేశారు.
ప్రజల కష్టం పట్టించుకోలేదు కానీ అధికారి కష్టం పట్టించుకోకుండా ఉండలేరు కదా.. అందుకే సరంజామా అంతా పట్టుకుని క్షణాల్లో హాజరయ్యారు అటవీశాఖ సిబ్బంది. మొసలిని బంధించి తీసుకుపోయారు. అది చూసి ప్రజలు నవ్వుకున్నారు. దీనిని బట్టి ప్రజలకు సేవ చేసే ప్రభుత్వ సిబ్బంది.. వారి పై అధికారులకంటే ఎంత వేగంతో పనిచేస్తారో తెలుసుకోవచ్చునని ప్రజలు చెప్తున్నారు.