జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేయించిందీ ఆర్ఎస్ఎస్ అంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెగేసి చెప్పారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన బుధవారం మహారాష్ట్రలోని భివాండీ న్యాయస్థానం ఎదుట విచారణకు హాజరయ్యారు.
అనంతరం ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రయోజనాల కోసం పెద్ద నోట్లను రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, దానికి అందరం సంతోషిద్దామని, అయితే కేంద్రం చెబుతున్న నల్లధనం ఎవరి వద్ద ఉందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం చెబుతున్నట్టు నల్లధనం ఉన్నవారెవరైనా ఈ ఎనిమిది రోజుల్లో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టారా? అని ఆయన ప్రశ్నించారు. తనకు ఎవరూ కనిపించలేదని ఆయన చెప్పారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.