చండీగఢ్: రేప్ కేసులో నిందితుడి ఇంటికి పదేపదే వెళ్ళడమే కాకుండా, అతని భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని పఠాన్ కోట్ ఎస్పీపై తాజా వివాదం మొదలైంది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ పైన ఉగ్రదాడి కేసులో ముష్కరులకు సహకరించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ పైన తాజాగా మరో లైంగిక వేధింపుల కేసు నమోదయింది.
గతంలోనూ పలువురు మహిళా పోలీసులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన.. ఈసారి ఏకంగా ఓ రేప్ కేసు నిందితుడి భార్యను లొంగదీసుకోవాలని ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం పంజాబ్ సాయుధ పోలీసు విభాగంలో అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహింస్తున్న సల్వీందర్ పైన ఈ మేరకు కేసు కూడా నమోదయింది. దీంతో తన ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఎస్పీని ఐజీ (ప్రొవిజన్) ఆదేశించారు. విశ్వసనీయ సమాచారం మేరకు సల్వీందర్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.
రేప్ కేసులో నిందితుడు, ప్రస్తుత కేసులో బాధితుడు అయిన వ్యక్తి ఇలా చెప్పుకొచ్చాడు.. 'నన్ను కేసు నుంచి తప్పించాలంటే రూ 50 వేలు లంచం ఇవ్వాలని సల్వీందర్ డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా పదేపదే మా ఇంటికి వచ్చి, నా భార్యతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఒకానొక దశలో ఆమెను చెరపట్టే ప్రయత్నం చేశాడు. ఎలాగోలా డబ్బులు సర్దినప్పటికీ ఆయన వేధింపులు ఆగలేదు. ఇక భరించలేని స్థితిలో అతని(ఎస్పీ సల్వీందర్)పై పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు ఫిర్యాదు చేశాం. దీంతో ఎస్పీపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే.. ఆ రెండు ఎంక్వైరీల్లోనూ సల్వీందర్‌కు క్లీన్ చిట్ లభించింది. మాపై వేధింపులు ఇంకా ఎక్కువయ్యాయి' అని బాధితుడు పేర్కొన్నాడు.