రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన శ్రేణుల్లోకి మహిళలను మరింతగా చేర్చుకోవాలని బీజేపీ కురువృద్ధ నేత లాల్ కృష్ణ అద్వానీ సెలవిచ్చారు. ప్రజాపిత బ్రహ్మకుమారీల సంస్థలో ప్రముఖ స్థానాల్లో మహిళలను నియమిస్తున్నారంటూ ప్రశంసలు గుప్పించిన అద్వానీ.. దేశంలోని సంస్థలు, తాను సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆరెస్సెస్ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని హితవు పలికారు.
ఇది చాలా ప్రత్యేకమైనది. అదే సమయంలో ఆ సంస్థ విలువల్ని పాటించడం అంత సులభం కూడా కాదు. నేను దీర్ఘకాలంగా పనిచేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దీంట్లో చిన్నప్పటినుంచి అనేక మంది మగపిల్లలు చేరుతుంటారు. ఆడపిల్లలు కూడా చేరుతుంటారు కాని వారి ప్రాతినిధ్యం చిన్నదే అని 89 ఏళ్ల అద్వానీ విచారం వ్యక్తం చేశారు.
ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ సంస్థాపకులు పితాశ్రీ బ్రహ్మ 48వ వర్థంతి సందర్భంగా ప్రసంగించిన అద్వానీ మహిళలకు అగ్రతాంబూలం ఇస్తున్న బ్రహ్మకుమారీల ఆదర్శాన్ని తన మాతృసంస్థ అయిన ఆరెస్సెస్ కూడా పాటించాలని, మహిళలను పెద్ద ఎత్తున సంస్థలోకి చేర్చుకోవాలని చెప్పడం సంచలనం గొలిపిస్తోంది.