ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి.. ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వంలో మంత్రులు జైలుకు వెళ్లడం, మరికొందరిపై ఆరోపణలు రావడం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు.
అప్పట్లో పార్టీ ప్రస్తావన వచ్చినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు ప్రపంచం మొత్తం చుట్టాల్సి వస్తుందని, పార్టీలో చేరే వ్యక్తులు మంచివారో, చెడ్డవారో ఎలా గుర్తిస్తావని తాను కేజ్రీవాల్‌ను ప్రశ్నించానని అన్నారు. అయితే అందుకు కేజ్రీవాల్ సమాధానం చెప్పలేకపోయారని హజారే గుర్తుచేసుకున్నారు. కానీ అది ఇప్పుడు నిజమైందని అన్నారు.
కేజ్రీవాల్ చాలా ఏళ్లు తనతో ఉన్నారని, దేశ రాజకీయాల్లో ఆయన సరికొత్త ఒరవడిని తీసుకువస్తారని ఆశించానని, దేశానికి దిశానిర్దాశం చేస్తారని అనుకున్నానని హజారే చెప్పారు. ఇప్పుడు ఆయన సహచరులు చేస్తున్న పనులు, ముఖ్యంగా కొందరు జైలుకు వెళ్లడం, మరికొందరు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం తనకు చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు.