ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 9 లక్షల వంతున అక్షయ్ అందజేశాడు. దీంతో అక్షయ్ దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. మనకు డబ్బు, హోదా, పరపతిని ఇచ్చిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలనే మంచి మనసు అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఒకడు.
దీనిపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా అక్షయ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అక్షయ్ చేసిన సాయం అమర జవాన్ల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని, ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అక్షయ్ ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. దేశంపై అక్షయ్ కు ఉన్న ప్రేమాభిమానాలను ఈ ఉదంతం వెల్లడిస్తోందదని చెప్పారు.
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ కూడా తన మంచి మనసు చాటుకున్నారు. చత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకి తన వంతు సహాయంగా ఒక్కో కుటుంబానికి రూ.6.5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారామె. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా సైనా ఈ ఆర్థిక సహాయం ప్రకటించినట్టు తెలుస్తోంది.