అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు పట్టిన శశికళ.. 'అమ్మ' సమాధి వద్ద ఆత్మహత్య యత్నం చేసిన యువతి

శనివారం, 31 డిశెంబరు 2016 (17:23 IST)
అన్నాడీఎంకే పార్టీకి దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే శశికళకు వ్యతిరేకంగా జయమ్మ సమాధి వద్ద ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం సంచలనం రేకెత్తించింది. పార్టీ పగ్గాలను శశికళ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ సుమతి అనే మహిళ విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. 
 
అయితే చుట్టుపక్కల వారు గమనించి ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. జయలలిత మృతి పట్ల అనేక అనుమానాలున్నాయని..  వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని మద్రాసు హైకోర్టు కూడా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయ సమాధి వద్ద ఆత్మహత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది.
 
ఇదిలా ఉంటే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన శశికళ.. పోయెస్ గార్డెన్ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లేందుకు జయలలిత వాడిన కారులోనే శశికళ వెళ్లారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు ‘చిన్నమ్మ..చిన్నమ్మ’ అంటూ నినాదాలు చేశారు. శశికళ ఫొటోలు, నినాదాలు ఉన్న టీ-షర్టులను ధరించిన ఆమె అభిమానులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రసంగించిన శశికళ, జయలలితను తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

వెబ్దునియా పై చదవండి