దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో రెండో నిందితురాలిగా ఉన్న శశికళ ప్రస్తుతం బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉంటున్నారు. ఈ జైల్లో ఓ సాధారణ ఖైదీలా ఆమె కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, ఈ జైలులో తాను ఉండలేనని, కటిక నేలపై పరుండలేనని, జైలు భోజనం భుజించలేనని ఆమె తనను కలిసిన కుటుంబ సభ్యుల వద్ద వాపోతుంది. అంతేకాకుండా తక్షణం తన లాయర్ల ద్వారా చెన్నై జైలుకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. దీంతో శశికళ తరపు న్యాయవాదులు విశ్వప్రయత్నాలు మొదలుపెట్టారు.
ఇందుకు సంబంధించి ఇప్పటికే న్యాయపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆమె తరపు న్యాయవాదులు దృష్టిపెట్టారు. పరప్పణ అగ్రహార జైలు సూపర్‌డెంట్‌కు లాయర్లు తమ వాదనను వినిపించనున్నారు. అంతేకాదు, కర్ణాటక న్యాయశాఖ మంత్రితో కూడా శశికళ జైలు మార్పు విషయమై లాయర్లు చర్చించనున్నారు.