సాంకేతిక కారణాలతో కేసునుంచి తప్పిస్తారా? అద్వానీని మళ్లీ బుక్ చేసిన 'సుప్రీం'

మంగళవారం, 7 మార్చి 2017 (04:16 IST)
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్‌కే అద్వానీపై, ఇతరులపై కేవలం సాంకేతిక కారణాలతో కేసులు తొలగించేందుకు అంగీకరించబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వారిపై నమోదైన కుట్ర ఆరోపణలపై అవసరమైతే విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. అడ్వానీతోపాటు మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, ఇతరులపై కేసు ఉపసంహరణకు సంబంధించి వాదనల సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను సంయుక్తంగా విచారించాలని ట్రయల్‌ కోర్టును ఆదేశిస్తామని జస్టిస్‌ పీసీ ఘోష్, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘కేవలం సాంకేతిక కారణాలతో 13 మందిని కేసు నుంచి విముక్తి చేసేందుకు అంగీకరించబోం. అలాగే అదనపు చారి్జషీటు సమర్పించేందుకు అనుమతిస్తున్నాం’ అని వెల్లడించింది. అనంతరం విచారణను కోర్టు ఈనెల 22కు వాయిదా వేసింది.
 
అడ్వానీ తరఫు న్యాయవాది కోర్టు వ్యాఖ్యలతో విభేదిస్తూ... రెండు కేసుల్లో వివిధ రకాల వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, వారిపై విచారణ చివరి దశలో ఉందని, మళ్లీ ఇప్పడు ఉమ్మడి విచారణ చేస్తే మళ్లీ మొదటికొస్తుందని వాదించారు. 
 
1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి అడ్వానీ సహా 13 మందిపై అభియోగాల్ని ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును అలహాబాదు హైకోర్టు సమర్థించగా... సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. కరసేవకులపై నమోదైన మరో కేసు లక్నో కోర్టు విచారణలో ఉంది.
 

వెబ్దునియా పై చదవండి