అసెంబ్లీలు చేపల్ మార్కెట్‌లా తయారయ్యాయి. శాసనసభ, లోక్ సభ, రాజ్యసభ ఏదైనా ప్రస్తుతం ప్రజా సమస్యలపై పరిష్కారం అయ్యే అంశాలపై చర్చించేందుకు వేదిక కావట్లేదు. ప్రతిపక్షాల కొట్లాటకు, అధికారపక్షంపై విమర్శలు గుప్పించడానికి నిలయంగా మారిపోయాయి. ప్రజా సమస్యలపై చర్చించుకోకుండా.. రాజకీయ నేతల రాజకీయాలకు వేదికలయ్యాయి. అంతేగాకుండా స్పీకర్‌గా వ్యవహరించే వారి పట్ల ప్రజా ప్రతినిధులు గౌరవపూర్వకంగా ప్రవర్తించట్లేదు. ప్రజలచే ఎన్నుకోబడి, ప్రజా ప్రతినిధులుగా అసెంబ్లీకి వెళ్లే నేతలు బుద్ధి మందగించింది. ఫలితంగా స్పీకర్లపై దాడులకు దిగుతున్నారు.
అలాంటి ఘటనే జార్ఖండ్ అసెంబ్లీలో చోటుచేసుకుంది. జార్ఖండ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య తీవ్రవస్థాయిలో వాగ్వివాదం జరుగుతోంది. సహనం కోల్పోయిన ప్రతిపక్ష పార్టీల నాయకులు అసెంబ్లీలో చేతికి ఏది చిక్కితే దానితో అధికార పార్టీ నాయకుల మీద దాడి చేశారు. పేపర్లు, ఫైళ్లు, కుర్చీలు స్పీకర్ మీదకు విసిరేస్తున్నారు. అంతే కాకుండ ఓ శాసన సభ్యుడు తాను వేసుకున్న షూలు తీసి స్పీకర్ మీదకు విసిరారు. చేపల మార్కెట్ తరహాలో దర్శనమిచ్చే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే.. పార్లమెంట్ స్పీకర్ పట్ల కూడా ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పార్లమెంటు ఇరు సభల్లో గందరగోళం చెలరేగుతోంది. గురువారం నాడు స్పీకర్ సుమిత్రా మహాజన్ పైన సమాజ్‌వాది పార్టీ ఎంపీ పేపర్లు విసిరారు. నోట్ల రద్దుపై ప్రధాని మాట్లాడాల్సిందిగా లోక్ సభలో విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం సభ ప్రారంభం కాగానే విపక్ష పార్టీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహజన్ పోడియం వద్దకు చేరి నినాదాలు చేశారు.