విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కిడ్నీ ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శనివారం సుష్మ స్వరాజ్‌కు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ఎయిమ్స్ డైరెక్టర్ ఎమ్ సీ మిశ్రా, సర్జన్లు వీకే బన్సల్, వీ శీను, నెఫ్రాలజిస్టు సందీప్ మహాజన్‌లు ఐదు గంటల పాటు ఆపరేషన్‌ను నిర్వహించినట్లు తెలిసింది.
శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సర్జరీ మధ్యాహ్నం 2.30నిమిషాలకు ముగిసింది. ఆ తర్వాత సుష్మను ఐసీయూకు మార్చినట్లు సమాచారం. అయితే సుష్మాకు కిడ్నీ దానం చేసిన దాత వివరాలు తెలియరాలేదు. డయాబెటిస్‌తో బాధపడుతున్న సుష్మా కొంతకాలంగా బాధపడుతున్నారు. దీనికి తోడు కిడ్నీ ఫెయిల్ కావడంతో ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు వారానికి మూడు సార్లు డయాలసిస్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
కిడ్నీ మ్యాచ్ కాకుండా ఇన్నాళ్లు ఆస్పత్రిలోనే ఉన్న సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానం చేసేందుకు చాలామంది ముందుకొచ్చారు. చివరి కిడ్నీ సరిపోవడంతో.. ఆమెకు ఆపరేషన్ చేసామని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. నవంబర్ ఏడో తేదీన ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సుష్మా స్వరాజ్ త్వరలో కోలుకోవాలని రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు, ప్రజలు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియా ద్వారా ఆశిస్తున్నారు. ఆస్పత్రిలో ఆమెను పరామర్శిస్తున్నారు.