చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రామ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో తిరునల్వేలి జిల్లాలోని మీనాక్షిపురం అనే గ్రామంలోని అతని ఇంట్లోనే రామ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో రామ్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్లేడుతో గొంతు కోసుకునేందుకు యత్నించి విఫలమైన విషయం తెల్సిందే.
ఈనేపథ్యంలో రామ్ కుమార్‌ను చెన్నై శివారు ప్రాంతంలోని పుళల్ కేంద్ర కారాగారంలోని ప్రత్యేక గదిలో బంధించారు. అయితే, రామ్ కుమార్ జైల్లోని విద్యుత్ వైర్లు నోటితో పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు జైలు సిబ్బంది చెపుతున్నారు. ఈ విద్యుదాఘాతంలో గాయపడిన రామ్ కుమార్‌ను తొలుత జైలు ఆస్పత్రి... ఆ తర్వాత రాయపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపు ప్రాణాలు విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.
ఈ విషయాన్ని స్వాతి హత్య కేసుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసు అధికారి శంకర్ ధ్రువీకరించారు. కాగా, రామ్‌కుమార్ లాయర్ రామరాజన్ మాత్రం జైల్లోనే రామ్‌కుమార్‌ను హత్య చేసినట్టు ఆరోపించారు. ఇది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. జూన్ 24న నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతిని నరికి చంపాడనే అభియోగంపై జూలై ఒకటో తేదీన రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.
అయితే, పుళల్ కేంద్ర కారాగారంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పైగా, జైలు గదుల్లో ఎక్కడా కూడా విద్యుత్ వైర్లు చేతికి అందేంత ఎత్తులో ఉండవు. పైగా, సెంట్రీలు నిత్యం పహారా కాస్తుంటారు. అలా కట్టుదిట్టమైన భద్రత ఉన్న పుళల్ సెంట్రల్ జైలులో రామ్ కుమార్ విద్యుత్ వైర్లు ఎలా పట్టుకున్నాడు.. వాటిని ఎలా నోటితో కొరికాడన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు.. తన కుమారుడిని జైల్లోనే హత్య చేశారని రామ్ కుమార్ తండ్రి ఆరోపించారు.