సాధారణంగా ఏ ప్రభుత్వంలో అయినా... జనాకర్షక పథకాలంటే, బడా నేతల పేర్లు... ఫోటోలు లేకుండా పని అంగుళం కూడా జరగదు. పేదల స్కీములు మొదలుకొని... పెద్దల స్కీముల వరకు అన్నింటికీ, దేశ్ కీ నేతా, రాష్ట్ర కీ నేతా పేర్లు పెట్టేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న దీవెన, జగనన్న చేయూత, వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ... ఇలా ఇప్పుడు తండ్రీకొడుకుల పేర్ల ట్రెండ్ నడుస్తోంది.
గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో చంద్రన్న కానుక, ఎన్టీయార్ భరోసా లాంటి పేర్లు పెట్టారు. చంద్రబాబు హయాంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పేరు మీద అన్న క్యాంటీన్ అని పెట్టారు. కానీ, ఈ ట్రెండ్‌కి భిన్నంగా తమిళ యువ సీఎం స్టాలిన్ పాలనలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం పేదలకు తెల్ల కార్డులపై ఇచ్చే 14 రకాల నిత్యావసర వస్తువుల పంపిణీలో ఎలాంటి హంగు ఆర్భాటం... ప్రచార పటాటోపం లేకుండా కేవలం సరుకుల సంచి మాత్రమే ఇస్తున్నారు. దీనిపైన సీఎం స్టాలిన్ బొమ్మ గాని, చివరికి తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి, డిఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి బొమ్మ గానీ లేదు. దీనిని చూసి పేద ప్రజలు ఔరా అంటున్నారు.
ఇటు ఏపీలోగాని, అటు తెలంగాణాలో గాని రేషన్ పంపిణీకి ప్రచారం హంగామా. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు, ఆయన తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బొమ్మలతో నాణ్యమైన బియ్యం పేరిట సంచిలను ఇక్కడ అందిస్తున్నారు. గతంలో చంద్రబాబు సైతం... చంద్రన్న కానుక పేరుతో పెద్ద పెద్ద ఫోటోలు వేయించుకున్నారు.
అంతేకాదు... నిత్యావసరాల బ్యాగులపై అప్పటి పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఫోటో కూడా తగిలించారు. కానీ, ఎలాంటి ఫోటోలు లేకుండా... నిరాడంబరంగా... తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం అందిస్తున్న నిత్యవాసరాల బ్యాగులు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఐతే.. జయలలిత జీవించి వుంటే ఈ లెక్క వేరేగా వుండేదనే వాదన సైతం లేకపోలేదు.