భారత్ - పాక్‌ల మధ్య కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలి : టర్కీ ప్రెసిడెంట్

ఠాగూర్

బుధవారం, 24 సెప్టెంబరు 2025 (10:52 IST)
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న కాశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా పరిష్కరించాలని టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ అన్నారు. చర్చల ద్వారానే కాశ్మీర్ ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. 
 
ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఆయన ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, భారత్- పాక్ మధ్య కొనసాగుతున్న కాశ్మీర్ వివాదాన్ని ప్రస్తావించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి మాట్లాడారు. ఆ ఉద్రిక్తతలు ఘర్షణగా మారాయన్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఇరుదేశాల మధ్య జరిగిన కాల్పుల ఒప్పందానికి తాము సంతోషంగా ఉన్నామన్నారు. 
 
అయితే, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ - పాక్ మధ్య సహకారం చాలా ముఖ్యమన్నారు. ఈ క్రమంలో భారత్ - పాక్ మధ్య కొన్నేళ్లుగా నెలకొన్న కాశ్మీర్ వివాదం గురించి లేవనెత్తారు. కాశ్మీర్ సమస్యను ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా పరిష్కరించాలని తాను కోరుతున్నట్లు పేర్కొన్నారు. అక్కడి ప్రజలకు చర్చల ద్వారా మేలు జరగాలని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
 
జమ్మూకాశ్మీర్ అంతర్గత విషయమని భారత్ పదేపదే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. ఎర్డోగాన్ తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. ఆయన కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేకసార్లు దీనిపై మాట్లాడారు. 2019 నుంచి ఐరాస ప్రసంగాల్లో నిరంతరం కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూనే ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు