కమలనాథుల 14 యేళ్ళ వనవాసానికి తెరపడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా, శనివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ రెండు రాష్ట్రాల్లో విజయభేరీ మోగించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. నాలుగింట మూడొంతుల సీట్లు సాధించింది. అదేసమయంలో గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోగా, మణిపూర్‌లో విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.
ఇక యూపీ విషయానికి వస్తే రెండున్నర దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని ఎస్పీ, బీఎస్పీలు ఏలాయి. దీంతో యూపీలో బీజేపీకి 14 సంవత్సరాలపాటు అధికారం అందని ద్రాక్షగా మారింది. అయితే తాజా ఎన్నికల్లో బంపర్ మెజారిటీ సాధించడంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. 403 సీట్లు ఉన్న యూపీలో బీజేపీ ఏకంగా 325 సీట్లు సాధించింది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 1977 తర్వాత ఇప్పటివరకు ఇన్ని సీట్లు ఏ పార్టీకి రాకపోవడం గమనార్హం. ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి 54 సీట్లు రాగా, బీఎస్పీకి 19, ఇతర పార్టీలకు 5 చొప్పున సీట్లు వచ్చాయి. దీంతో కమలనాథుల 14 యేళ్ల వనవాసం శనివారంతో ముగిసినట్టయింది.