పాకిస్థాన్‌ను భౌతికంగా దెబ్బకొట్టాలి.. సైనిక చర్యకు సిద్ధం కావాలి : మాజీ సైనికుల డిమాండ్

సోమవారం, 19 సెప్టెంబరు 2016 (08:36 IST)
పాకిస్థాన్‌ను భౌతికంగా దెబ్బకొట్టాలని, ఇందుకోసం సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని మాజీ సైనికులు డిమాండ్ చేశారు. భారత-పాక్‌ల నడుమ ఉన్న నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో ఉన్న కీలక గ్రామమైన యూరీలోని సైనిక స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రమూకలు దాడి చేసి 17 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయంతెల్సిందే. దీనిపై మాజీ సైనికులు తమదైనశైలిలో స్పందించారు. 
 
యూరీ బేస్‌పై దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై తక్షణచర్యలు తీసుకోవాలని.. పాక్‌ గడ్డపై నుంచి పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదులపై సైనికచర్యకు సైతం సన్నద్ధంగా ఉండాలని మాజీ సైనికాధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే కొన్ని ప్రదేశాల్లో దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ జైస్వాల్‌ అభిప్రాయపడ్డారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు భౌతికంగా దెబ్బ తగిలితే తప్ప దానికి మన సంయమనం విలువేంటో అర్థం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా, ఎలాంటి చర్యా తీసుకోబోమన్న ధైర్యంతోనే పాకిస్థాన్‌ పదేపదే ఉగ్రదాడులకు పాల్పడుతోందని రిటైర్డ్‌ మేజర్‌ గౌరవ్‌ ఆచార్య మండిపడ్డారు. కాశ్మీర్‌లో సమస్యలన్నిటికీ మూలం రావల్పిండి(పాకిస్థాన్‌)లో ఉందని ఆయన ధ్వజమెత్తారు. పాక్‌కు బుద్ధి చెప్పాలంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆ దేశంలో వాణిజ్యాన్ని నిలపివేయాలని, పాక్‌ 'మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ హోదా'ను తగ్గించాలని గౌరవ్‌ ఆచార్య సూచించారు. 

వెబ్దునియా పై చదవండి