యూరీ గ్రామం. భారత-పాక్‌ల నడుమ ఉన్న నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో ఉన్న కీలక గ్రామమిది. కొండలు, గుట్టలతో ఉగ్ర చొరబాట్లకు అనుకూలంగా ఉండే ప్రాంతం. 1947లో భారత్ ఏర్పాటైన కొన్నాళ్లకే పాక్ ప్రేరేపిత కబాలీలు ఈ ప్రాంతం నుంచే కాశ్మీర్‌లోకి చొరబడి బారాముల్లా వరకూ వెళ్లి తీవ్ర వినాశనానికి కారణమయ్యారు.
ఒకరకంగా చెప్పాలంటే.. 1947 యుద్ధం లేదా మొదటి కాశ్మీర్ యుద్ధం మొదలైంది ఇక్కడి నుంచే. అందుకే ఇది అంత కీలకమైన స్థావరం. బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్ అయిన ఇక్కడి ఆర్మీ బేస్‌లో ఎప్పుడూ 12000 నుంచి 13000 మంది సైనికులు ఉంటారు. ఇన్నేళ్లుగా ఆ సరిహద్దును గోడలా కాస్తున్న సైనికులు చొరబాట్లను ధీటుగా అడ్డుకుంటూ మనదేశంలోకి ప్రవేశిస్తున్న మిలిటెంట్లను కాల్చిపారేస్తూ ఉగ్రవాదుల సంఖ్యను 300లోపునకు తగ్గించగలిగారు.
అయితే ఈ బేస్‌కున్న లోపం ఏమిటంటే.. దీనికి మూడువైపులా నియంత్రణ రేఖ ఉంటుంది. ఏ పక్క నుంచి అయినా మిలిటెంట్లు చొరబడి దాడులకు దిగే ప్రమాదం ఉంది. ఈ మూడుదారుల్లో దక్షిణం పక్క మార్గం బేస్‌కు ఎంత దగ్గరగా ఉంటుందంటే.. నియంత్రణ రేఖ నుంచి కేవలం 6 కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు.. బేస్‌ను చేరుకోవచ్చు. అలాగే, పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ హైవే యూరీ మధ్యలోంచి వెళ్తుంది. అది కూడా ఉగ్రవాదులకు అనుకూలమే.