రక్షించాల్సిన ఖాకీలే వేధింపులకు గురిచేశారు. ఆకతాయిల నుంచి రక్షించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించిన ఇద్దరు మైనర్లకు పోలీస్ స్టేషన్లోనే వేధింపులు ఎదురైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ మధ్య యూపీలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్న సంగతి తెలిసిందే. గతవారం రామ్‌పూర్ ప్రాంతంలో ఇద్దరు యువతులను దాదాపు 14 మంది ఆకతాయిలు చుట్టుముట్టి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు ఆకతాయిలను పట్టుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన ఇద్దరు మైనర్లు ఆకతాయిలు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే వారిని ఆకతాయిల నుంచి రక్షించాల్సింది పోయి ఈశ్వర్ ప్రసాద్ అనే కానిస్టేబుల్ మైనర్లలో ఒకరితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దాన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఎస్పీ రాజేశ్ వెంటనే అతడిని సస్పెండ్ చేశారు.