వందేం ఖర్మ.. 400 ఉపగ్రహాలనూ అవలీలగా పంపే సత్తా మనది: ఇస్రో

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (06:25 IST)
భవిష్యత్తులో మూడు లేదా నాలుగు కేజీల ఉపగ్రహాలను తయారు చేయగలిగితే 104 కాదు 400 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించగల సామర్థ్యం ఇస్రోకు ఉందని ఆ సంస్థ మాజీ చైర్మన్ జి. మాధవన్ నాయర్ ప్రకటించారు. 104 ఉపగ్రహాలను ఒకేసారి పంపించడం కొత్త పరిజ్ఞానం కాదు. మేము (ఇస్రో) పది ఉపగ్రహాలతో మొదలుపెట్టాం. ఆ తర్వాత 18. ఆపై 35. ఇప్పుడు 100. మూడు లేదా నాలుగు కేజీల ఉపగ్రహాలను తయారుచేయగలిగితే అంతరిక్ష వాహన నౌక పీఎస్‌ఎల్వీ 300 నుంచి 400 ఉపగ్రహాలను ఒకేసారి తీసుకెళ్లగలద’’ని నాయర్ చెప్పారు.
 
ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ37 రాకెట్‌తో 104 ఉపగ్రహాలు ప్రయోగించడం ప్రపంచంలోనే ఓ రికార్డ్‌. 2013లో ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా 29 ఉపగ్రహాలను తన ఆర్బిటల్‌ సైన్స అంతరేస్‌ రాకెట్‌తో ప్రయోగించింది. 2014లో రష్యా తన డెనార్‌ రాకెట్‌తో ఒకేసారి 37 ఉపగ్రహాలను రోదసిలోకి చేరవేసింది. 2016 జూన్‌లో 20 ఉపగ్రహాల ప్రయోగమే ఇస్రో పేరిట ఇప్పటి దాకా ఉన్న రికార్డు. తాజా ప్రయోగంతో ఈ రికార్డులన్నీ బద్దలయ్యాయి. అయితే ఇస్రో మాత్రం.. ‘‘ఇది రికార్డు కోసం చేసిన ప్రయోగం కాదని.. మన సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు చేసిన ప్రయోగమ’’ని సవినయంగా ప్రకటించడం విశేషం.
 
భారతదేశం ఇప్పటిదాకా మొత్తం 226 ఉపగ్రహాలను రోదసిలోకి ప్రవేశపెట్టగా.. అందులో 180 విదేశాలకు చెందినవే! ఇస్రో వాణిజ్య ప్రయోగాల సత్తాను, ఘనతను చాటే గణాంకాలివి. ఈ లెక్కలో మరో విశేషం ఉంది. ఆ 180 ఉపగ్రహాల్లో 101.. బుధవారంనాటి ప్రయోగంలో పంపినవే! మిగతా 79 ఉపగ్రహాలనూ గత 17 ఏళ్ల వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మనదేశం ప్రయోగించిన తొలి విదేశీ ఉపగ్రహం.. జర్మనీకి చెందిన 45 కిలోల టబ్‌ శాట్‌. 1999లో పీఎ్‌సఎల్‌వీ సీ2 ద్వారా ఇస్రో దాన్ని ప్రయోగించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. బుధవారం ప్రయోగం ద్వారా.. 180 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిన అంతరిక్ష పరిశోధన సంస్థగా ఇస్రో మరో రికార్డు కూడా సాధించింది. ఈ ప్రయోగం విజయవంతంతో ఇక విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలతో ఇస్రో మరింత బిజీ అయిపోయే అవకాశం కనిపిస్తోంది.  
 

వెబ్దునియా పై చదవండి